TVk: నటుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంచి మిత్రులని టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ వెల్లడించారు. రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీవీకే, కాంగ్రెస్ మధ్య కూటమి ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విజయ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్‌తో పొత్తుకు టీవీకే సానుకూలంగా ఉందని ఫెలిక్స్ గెరాల్డ్ సంకేతాలు ఇచ్చారు. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీవీకే, కాంగ్రెస్ విధానాలు ఒకేలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ కోణంలో చూస్తే రెండు పార్టీలూ సహజ భాగస్వాములేనని వ్యాఖ్యానించారు. విజయ్, రాహుల్ గాంధీ మధ్య వ్యక్తిగత స్నేహం కూడా రాజకీయ సహకారానికి దోహదపడుతుందని తెలిపారు.
అయితే, కూటమి ఏర్పాటుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. ముఖ్యంగా తమిళనాడు కాంగ్రెస్ నేతలే పొత్తుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కొందరు నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీవీకేతో కలిసి ముందుకు రావడం లేదని అన్నారు.
టీవీకే–కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే మైనారిటీ ఓట్లు, బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై ఇరుపార్టీలు ఇంకా చర్చించాల్సిన అవసరం ఉందని, అయినప్పటికీ కూటమికి మంచి అవకాశాలు ఉన్నాయని ఫెలిక్స్ గెరాల్డ్ స్పష్టం చేశారు.
