TVK Chief Vijay: తమిళ సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ దళపతి, ఇప్పుడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలితలా – సినిమా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని బలంగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీవీకే సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. గ్రామం నుంచి గ్రామానికి, వీధి నుంచి వీధికి తిరిగి ప్రజలతో కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గాలు ఆలోచించాలనే అన్నాదురై సూత్రాన్ని విజయ్ తన పార్టీ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు.
ఆగస్టు 21న మధురైలో టీవీకే రెండో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని “మన రాజకీయ శత్రువులు (డీఎంకే), సైద్ధాంతిక శత్రువులు (బీజేపీ)పై గెలవడానికి మొదటి పెద్ద అడుగు” అని విజయ్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమావేశం తర్వాత రాష్ట్రం మొత్తం ప్రచారం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Naga Vamsi: ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనంలో టాలీవుడ్ నిర్మాత
ఇప్పటివరకు విజయ్ ఏఐఏడీఎంకేపై విమర్శలు చేయకపోవడం, ఎన్నికలకు దగ్గరగా ఆ పార్టీతో పొత్తు కుదిరే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలకు కారణమైంది. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, మధురై సమావేశం టీవీకేకు పూర్తి స్థాయి ఎన్నికల యుద్ధానికి లాంచ్‌ప్యాడ్‌లా మారే అవకాశం ఉంది.
విజయ్ ముందు ఉన్న సవాలు చిన్నది కాదు. శివాజీ గణేషన్, విజయకాంత్, శరత్‌కుమార్, కమల్ హాసన్‌లాంటి స్టార్ హీరోలు ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల ఫలితాల్లో ఆ మద్దతును చూపలేకపోయారు. కానీ విజయ్ తన పెద్ద అభిమాన వర్గం, అట్టడుగు వర్గాల మద్దతు, వ్యూహాత్మక ప్రణాళికతో ఈ ట్రెండ్‌ను మార్చాలనుకుంటున్నారు.