Tummala nageshwar rao: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు రోజురోజుకు కలుషితమవుతున్నాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితుల్లో తన రాజకీయ జీవితంపై ఎలాంటి మరక పడకుండా ఉండటం వెనుక ప్రధాన కారణం దివంగత మహానేత ఎన్టీ రామారావోనే అని స్పష్టంగా చెప్పారు.
ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల ప్రసంగించారు. తన రాజకీయ యాత్రకు ఎన్టీఆర్ ప్రభావం ఎంతో ప్రత్యేకమని, 1983 నుంచి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని గుర్తుచేసుకున్నారు. “ఎన్టీఆర్ శిష్యుడు ఎవరు అంటే తుమ్మల అని ప్రజలు చెప్పుకునే స్థాయికి చేరడం నా జీవితంలో పెద్ద గౌరవం” అని భావోద్వేగానికి గురయ్యారు. రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ స్వయంగా తనకు కండువా కప్పిన రోజును జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయిన జ్ఞాపకమని తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, విలువలతో రాజకీయాలు చేయడం ఎన్టీఆర్ నుంచే నేర్చుకున్నానని ఆయన అన్నారు
సభలో మాట్లాడిన తుమ్మల, రాష్ట్రం మరియు జిల్లాల అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం తన రాజకీయ ధ్యేయమని తెలిపారు.
ఇంతకుముందు, తెలంగాణ రైతులకు శుభవార్తను కూడా మంత్రి తుమ్మల తెలిపారు. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం త్వరలోనే జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సాయం రెండు విడతల్లో, ప్రతి సీజన్‌కు రూ.6,000 చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకుంటోందని చెప్పారు

