TTD

TTD: టీటీడీ సంచలన నిర్ణయం: నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగులు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారనే ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ సంస్థ నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది.

సస్పెండ్ అయిన వారిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్) బి. ఎలిజర్, బర్డ్ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆసుపత్రి గ్రేడ్-1 ఫార్మసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో విధులు నిర్వహిస్తున్న డా. జి. అసుంత ఉన్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీటీడీలో విధులు నిర్వహిస్తూ చర్చిలలో ప్రార్థనలు చేస్తున్న ఉద్యోగుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలాంటి ఒక వీడియోలో ఒక ఉద్యోగిణి చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా కెమెరా కంటపడింది. వీడియో తీస్తున్నట్లు గుర్తించి వెంటనే ఆమె ముఖంపై పైట కప్పుకుంది. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు టీటీడీని కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.

Also Read: Donald Trump: మాతో తలపడితే అంతే: బ్రిక్స్ దేశాలకు ట్రంప్‌ వార్నింగ్‌

ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీలో 1,000 మందికి పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని ఆరోపించి, వారిపై తక్షణ విచారణ జరిపి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, గత టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. కేవలం 22 మంది అన్యమత ఉద్యోగులను మాత్రమే గతంలో గుర్తించినట్లు తెలిపారు. కానీ, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ మాత్రం ఈ సంఖ్య 1,000 కంటే ఎక్కువ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేయడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో నలుగురు ఉద్యోగులపై టీటీడీ తీసుకున్న చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నకిలీ ఖాతాలపై టీటీడీ హెచ్చరిక:
ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ALSO READ  Taj Mahal: తాజ్‌మ‌హ‌ల్‌కు బాంబు బెదిరింపు క‌ల‌క‌లం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *