రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో టీటీడి అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తుల రక్షణ రిత్యా స్వామివారి మెట్టుమార్గాన్ని మూసివేసింది. కొండచరియలపై నిఘా ఉంచి ఘాట్‌రోడ్లలో ట్రాఫిక్‌జామ్ కాకుండా ఏర్పాట్లు చేసింది. భక్తుల దర్శనాలు, వసతికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసింది.
భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక వర్షాల నేపథ్యంలో శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. అలాగే భారీ వర్షాల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఇప్పటికే తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.