TTD : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన విమర్శలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. శ్రీనివాస్ గౌడ్ తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే దాన్ని సమర్థించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటంలో ఎవరైనా తప్పిదం చేస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శ్రీనివాస్ గౌడ్ నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై విమర్శలు గుప్పించారు. “తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధులకు టీటీడీ వివక్ష చూపిస్తోంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. దేవుడు ముందు అందరూ సమానమేనని, వివక్ష చూపడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యాపారాలు, పదవుల్లో ఎక్కువ లాభం పొందుతున్నవారు ఆంధ్ర ప్రజలేనని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. “తెలంగాణపై వివక్ష చూపితే, రాబోయే కాలంలో ఆంధ్రా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని” ఆయన పేర్కొనడంతో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.