Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన భారీ చోరీకి సంబంధించి టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రూ. 100 కోట్లకు పైగా దొంగతనం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు, వైసిపి నాయకులకు వాటాలు వెళ్ళాయని ఆయన ఆరోపించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
పరకామణిలో దొంగతనం చేస్తున్న రవికుమార్ వీడియోలను విడుదల చేసిన భాను ప్రకాష్ రెడ్డి… “కొన్నేళ్లుగా చోరీ చేసిన ఆ డబ్బుతో కోట్లు రూపాయల రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఒక దొంగ నుంచి మిగిలిన దొంగలు అందరూ స్వామివారి సొమ్మును దోచుకున్నారు” అని వ్యాఖ్యానించారు. టీటీడీ చరిత్రలోనే ఇంత భారీ దొంగతనం గత ప్రభుత్వంలో జరిగిందని ఆయన అన్నారు.
అప్పటి అధికారుల పాత్రపై అనుమానాలు:
భక్తులు ఎంతో భక్తితో హుండీలో వేసిన కానుకలను దోచుకున్నారని, ఈ కుంభకోణం రూ. 100 కోట్లకు పైగా ఉంటుందని భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ కేసును హైకోర్టు సీఐడీకి అప్పగించిందని, వచ్చే నెల రోజుల్లో సీల్డ్ కవర్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన బోర్డు నిర్ణయాలు, ఇతర పత్రాలు సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు.
రాజీకి వెళ్లిన అప్పటి అధికారులు:
అప్పట్లో ఈ కేసును లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళారని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ కేసులో వైసిపికి చెందిన చాలామంది ప్రముఖులు, ఉన్నతాధికారులు భాగస్వామ్యులని, త్వరలోనే వారందరి పేర్లు బయటకు వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ఒక అధికారి బయట పెట్టబోతున్నారని ఆయన తెలిపారు.
Also Read: Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కేవలం గంటన్నరలో తిరుపతికి వెళ్లొచ్చు.. కొత్త సర్వీస్
తాడేపల్లి ప్యాలెస్‌కు సొమ్ము చేరిక:
స్వామివారి సొత్తును దోచుకోవడమే లక్ష్యంగా ఒక కీలకమైన పోలీస్ అధికారి పని చేశారని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చోరీ సొమ్ములో కొంత తాడేపల్లి ప్యాలెస్‌కు చేర్చారని, ఈ ఘటన జరిగిన తరువాత సాక్ష్యాలను తొలగించి, ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణం జరిగినప్పుడు టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని, ఇప్పుడు దీనికి ఆయన సమాధానం చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.