TTA Seva Days: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ), తమ పదవ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సేవా దృక్పథంతో కూడిన బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 8 నుంచి 22 వరకు ‘టీటీఏ సేవా డేస్’ ను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థ త్రైమాసిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీఓడీ) ప్రకటించింది.
అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం, చార్లెట్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, అడ్వైజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, కో-చైర్మన్ డాక్టర్ మోహన్ రెడ్డి, సభ్యులు భరత్ రెడ్డి మాదాది, శ్రీను అనూగు, అధ్యక్షులు నవీన్ రెడ్డి పెద్ది, పోస్ట్ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మరియు బోర్డు సభ్యుల సారథ్యంలో ఈ సమావేశం విజయవంతమైంది.
‘సేవా డేస్’ – సాంస్కృతిక ఐక్యతకు నిదర్శనం
టీటీఏ చేపట్టనున్న ఈ ‘సేవా డేస్’ కార్యక్రమాలు కేవలం సేవా దృక్పథానికే కాక, సాంస్కృతిక ఐక్యత మరియు సమాజ అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తాయని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఈ చొరవ ద్వారా సామాజిక సేవా రంగంను మరింత విస్తరించడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
మెగా కన్వెన్షన్ 2026: కన్వీనర్ నియామకం
ఈ సమావేశంలో టీటీఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం మెగా కన్వెన్షన్-2026 కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- కన్వీనర్ ఎంపిక: మెగా కన్వెన్షన్-2026కు కన్వీనర్‌గా ప్రవీణ్ చింతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- ముహూర్తం ఖరారు: ఈ ప్రతిష్టాత్మక కన్వెన్షన్‌ను 2026, జులై 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు నిర్వహించాలని తీర్మానించారు.
అంతేకాక, సంస్థ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో ఫండ్ రైజింగ్ జరగడం విశేషమని టీటీఏ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
ఉత్తమ సేవకు సత్కారం
ఈ త్రైమాసికంలో అత్యుత్తమంగా పనిచేసిన రీజినల్ వైస్-ప్రెసిడెంట్లు దిలీప్, ప్రదీప్, రాజు రెడ్డిలను బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే, సంస్థ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేసిన స్టాండింగ్ కమిటీ సభ్యులను కూడా ప్రశంసించారు. ఈ సమావేశం విజయవంతం కావడానికి కృషిచేసిన సభ్యులందరికీ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పెద్ది ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

