TTA Board of Directors Meeting: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) పదేండ్ల సంబురాలు తెలంగాణలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మలిపెద్ది ప్రకటించారు. అమెరికా డాలస్‌లో తాజాగా జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే డిసెంబర్ నెల అంతా వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, నెలాఖరున హైదరాబాద్ శిల్పకలా వేదికలో భారీ వేడుక నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఫౌండర్ పైళ్ల మల్లారెడ్డి కూడా హాజరయ్యారు.
అమెరికాలోని డాలస్ నగరంలోని డాలస్ హయత్ హోటల్ జరిగిన టీటీఏ బోర్డు డైరెక్టర్ల సమావేశం అనంతరం నవీన్‌రెడ్డి సహా పలువురు బోర్డు కార్యవర్గ సభ్యులు మహాన్యూస్ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూల్లో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. టీటీఏ మాజీ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచర్ల, వైస్ ప్రెసిడెంట్ గణేశ్, డెవలప్‌మెంట్ డైరెక్టర్ చింతా ప్రవీణ్, డైరెక్టర్లు నవీన్‌రెడ్డి, విశ్వకాంతి తదితరులు మహాన్యూస్‌తో ముచ్చటిస్తూ పలు విషయాలను పంచుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతి మూడు నెలలకోసారి జరిగే బోర్డు డైరెక్టర్ల మీటింగ్‌లో భాగంగా ఈసారి డాలస్ నగరంలో నిర్వహించామని చెప్పారు. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. డాలస్ టీంకు వారంతా ధన్యవాదాలు చెప్పారు. ఆరంభం నుంచి భోజనాల వరకు చాలా చక్కగా ఏర్పాట్లు చేశారని బోర్డు ముఖ్యులంతా సంతృప్తిని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా వచ్చారని, టీటీఏ గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూలంకశంగా చర్చించామని వారు వివరించారు.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఏర్పడి పది సంవత్సరాలను పూర్తి చేసుకున్నదని వారు ప్రకటించారు. తొలుత పైళ్ల మల్లారెడ్డి మరికొందరు ఈ అసోసియేషన్‌ను ఆరంభించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సేవా, సాంసాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను నిర్వహించినట్టు వివరించారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలతో చాలా సంతృప్తిగా ఉన్నదని వెల్లడించారు.
గత జనవరి నెల 18న నవీన్‌రెడ్డి మలిపెద్ది అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి ఈ 138 రోజుల్లో 70కి పైగా సేవా తదితర కార్యక్రమాలు టీటీఏ ఆధ్వర్యంలో చేపట్టామని వారు వివరించారు. బోర్డు డైరెక్టర్లు, ఇతర కార్యవర్గ సభ్యులంతా ఈ కార్యక్రమాలకు పూర్తిగా సహకరించారని చెప్పారు.
టీటీఏలో కొత్తగా 600 మంది సభ్యులుగా చేరారని, వారి దరఖాస్తులను ఈ సమావేశంలో పరిశీలించామని తెలిపారు. భవిష్యత్తులో అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల ప్రణాళికల గురించి విపులంగా చర్చించామని చెప్పారు. గతంలో హెల్త్‌కేర్, టెన్నిస్, క్రికెట్, రాకెట్ బాల్ టోర్నమెంట్స్ నిర్వహించామని తెలిపారు. పలువురు నిరుద్యోగులకు ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు చొరవ తీసుకున్నట్టు వివరించారు.
2026 జూలై 17, 18, 19 తేదీల్లో రెండేండ్ల కన్వెన్షన్‌ను చార్లెట్‌లో ఘనంగా నిర్వహించాలని ఇదే సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి 25,000 మందిని ఆహ్వానించాలని నిర్ణయించారు. అదే విధంగా ఇండియాలో ఈ ఏడాది డిసెంబర్ నెలంతా సేవా, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
డిసెంబర్ తొలి వారం నుంచి నెలాకరు వరకు ఆయా కార్యక్రమాలు నిర్వహించి, ఆఖరు వారంలో హైదరాబాద్ శిల్పకలా వేదికలో బ్రహ్మాండమైన సదస్సును నిర్వహిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇండియాలో, ముఖ్యంగా తెలంగాణలో సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని వారు మహాన్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండియాలో కొత్త చాప్టర్‌ను ఓపెన్ చేస్తామని, అక్కడి ప్రభుత్వంతో చర్చించి, అవసరాలను గుర్తిస్తామని, ఆ మేరకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.