Trump

Trump Defends Tariffs: సుంకాలతో అమెరికా పై గౌరవం పెరిగింది.. ప్రతి ఒక్కరికి రూ.1.77 లక్షలు ఇస్తా..!

Trump Defends Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల విధానాన్ని (Tariff Policy) గట్టిగా సమర్థించుకున్నారు. సుంకాలు అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉన్నాయని, ఈ ఆదాయంతో దేశం జాతీయ రుణాన్ని తగ్గించడమే కాకుండా, ప్రతి పౌరుడికి భారీ మొత్తంలో డివిడెండ్ ఇస్తుందని సంచలన ప్రకటన చేశారు.

సుంకాలు వ్యతిరేకించేవారు ‘మూర్ఖులు’!

నవంబర్ 9వ తేదీ ఆదివారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ సుంకాలపై తన వైఖరిని గట్టిగా సమర్థించుకున్నారు. “టారిఫ్‌లను వ్యతిరేకించే వ్యక్తులు మూర్ఖులు!” అని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. సుంకాలు అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేశాయని, దేశాన్ని గతంలో కంటే మరింత సంపన్నంగా మార్చాయని ఆయన పేర్కొన్నారు. తన విధానాల వల్ల అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక, గౌరవనీయమైన దేశంగా నిలిచిందని అన్నారు. తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన స్టాక్ మార్కెట్, పెరుగుతున్న పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పారు. అమెరికన్ల పదవీ విరమణ ఖాతాలైన 401k ఖాతాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే రోల్ మోడల్: ‘సంజీవని ప్రాజెక్టు’ ప్రారంభించిన సీఎం

ప్రతి అమెరికన్‌కు 2,000 డాలర్లు హామీ!

ట్రంప్ తన పోస్ట్‌లో చేసిన మరో సంచలన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుంకాల ద్వారా అమెరికా ట్రిలియన్ల డాలర్లు సంపాదిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అదనపు ఆదాయాన్ని దాదాపు $37 ట్రిలియన్ల భారీ జాతీయ రుణాన్ని తగ్గించడం ప్రారంభించడానికి ఉపయోగిస్తామని అన్నారు. ఈ టారిఫ్ విధానాల వల్ల భవిష్యత్తులో ధనవంతులు తప్ప, ప్రతి అమెరికన్‌కు కనీసం $2,000 డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1,77,000 కంటే ఎక్కువ) డివిడెండ్‌ను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా కొత్త కర్మాగారాలు, ప్లాంట్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే, ఈ ప్రతిపాదిత సుంకం డివిడెండ్ ఎలా పంపిణీ చేయబడుతుంది లేదా అది ఎప్పుడు అమలులోకి వస్తుంది అనే దానిపై ట్రంప్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. సుంకాల ద్వారా వచ్చే ఆదాయం గురించిన ట్రంప్ వాదనలను స్పష్టమైన డేటాతో ఇంకా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సుప్రీంకోర్టులో తన కార్యనిర్వాహక అధికారాలపై విచారణ జరుగుతున్న తరుణంలో ట్రంప్ ఈ దూకుడు ప్రకటన చేయడం గమనార్హం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *