Donald Trump: ఇజ్రాయెల్ పార్లమెంటుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిసింది. ట్రంప్ నామస్మరణతో ఇజ్రాయెల్ నెస్సెట్ మార్మోగింది. ట్రంప్ ను యూదుల సంరక్షకుడని ట్రంప్ రూపంలో పర్శియన్ చక్రవర్తి సైరస్ ది గ్రేట్ బతికే ఉన్నారని పార్లమెంట్ స్పీకర్ ఒహానా పోల్చారు. ట్రంప్ నకు నోబెల్ ఇవ్వాలని చట్టసభ్యులు నినాదాలు చేశారు. ప్రపంచానికి చాలామంది ట్రంప్ ల అవసరం ఉందని చెబుతుంటే ట్రంప్ ఆనందంతో పొంగిపోయారు. ఎవరూ చేయలేంది ట్రంప్ చేశారనీ శ్వేతసౌధంలో తమకు ఉన్న గొప్ప మిత్రుడు ట్రంప్ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పొగడ్తలతో ముంచెత్తారు.
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఈ విజయం సాధించాయన్న నెతన్యాహు.. ఇకపై శాంతికి కట్టుబడి ఉంటామని, స్థిరత్వానికి కృషి చేస్తానని స్పష్టంచేశారు. తర్వాత ప్రసంగించిన ట్రంప్ .. ఉగ్రయుగం ముగిసిందని వ్యాఖ్యానించారు. చివరకు ఆ గడ్డపై శాంతి నెలకొందన్నారు. ట్రంప్ ప్రసంగం సమయంలో ఇద్దరు ఇజ్రాయెల్ నేతలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరిగింది జాతి హననమని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని భద్రతాబలగాలు బయటకు తీసుకెళ్లడంతో ట్రంప్ మళ్లీ ప్రసంగం చేశారు. 8 నెలల్లో ఎనిమిది యుద్ధాలను ముగించానని, యుద్ధాల అంతం చేయడమే తన లక్ష్యమని చెప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: కడపలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఇజ్రాయెల్ -హమాస్ మధ్య మధ్యవర్తిత్వంతో సమయం వృథా తప్ప ఏ ప్రయోజనం లేదని చాలామంది చెప్పారని కానీ చివరకు దాన్ని సాధించామని వివరించారు. ఓవైపు ఇజ్రాయెల్ -గాజా మధ్య యుద్ధం ముగిసి మిడిల్ ఈస్ట్ లో శాంతి నెలకొంటే…. పాకిస్తాన్ లో మాత్రం అగ్గిరాజుకుంది. పాలస్తీనియన్లకు మద్దతుగా, ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పాక్ లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనలను అదుపు చేయాలని చూసిన పోలీసులపై…. సీసాలు, కర్రలు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.