Khammam: ఖమ్మం జిల్లా, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పదవ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ప్రతిమ అనే బాలిక అనుమానాస్పద రీతిలో మరణించింది. పరీక్ష రాస్తున్న సమయంలో ఫిట్స్ వచ్చి చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెబుతుండగా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని తమ కూతురు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగింది?
కూసుమంచి మండలం, బోడియతండాకు చెందిన భూక్య రమేష్, బూబమ్మ దంపతుల కూతురు ప్రతిమ, గొల్లగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం పరీక్ష రాస్తున్న సమయంలో ప్రతిమకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించామని, ఆపై మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. అయితే, ఆసుపత్రికి వెళ్లేసరికే బాలిక చనిపోయిందని వైద్యులు చెప్పినట్లు సిబ్బంది వివరించారు.
Also Read: Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ఇదే
కుటుంబ సభ్యుల ఆరోపణలు
ప్రతిమ మృతి వార్త విని ఆసుపత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఫిట్స్ వచ్చినప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎలా తీసుకెళ్లారని సిబ్బందిని నిలదీశారు. ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.
అధికారుల హామీ
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. బాలిక మృతిపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బాలిక మృతికి గల కారణాలు, పాఠశాల సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, వైద్య సదుపాయాలపై మరోసారి చర్చ మొదలైంది.