Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒక రైలు బోగీలో అగ్ని ప్రమాదం జరిగింది. మూడో లైన్ నిర్మాణ పనుల కోసం పార్క్ చేసిన ఈ బోగీ పూర్తిగా దగ్ధమైంది.
శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో కేసముద్రం రైల్వే స్టేషన్‌లో నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల కోసం ఉంచిన ఒక పాత రైలు బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బోగీలో నిద్రిస్తున్న కార్మికులు మంటలను గమనించి వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఆ బోగీ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంటలు అంటుకోవడానికి కారణం షార్ట్ సర్క్యూటా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు, రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. కొన్ని అనుమానాల ప్రకారం, బోగీలో మంటలు చెలరేగే పదార్థాలు లేదా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు, రైల్వే అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో కలకలం సృష్టించింది.