Trai

TRAI: ఇన్సూరెన్స్ పేరు మీద ఫేక్ కాల్స్ ఇకపై చెల్లవు.. ట్రాయ్ కొత్త రూల్.. కంపెనీలు పాటించాలిసిందే

TRAI: టెలికాం రంగంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ కంపెనీల పేరుతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్న స్కామర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక నంబర్ సిరీస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఏంటి ఈ కొత్త మార్పు?

ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీలు తమ వినియోగదారులకు చేసే ముఖ్యమైన సర్వీస్ కాల్స్ లేదా లావాదేవీల సమాచారం కోసం ఖచ్చితంగా ‘1600’ తో ప్రారంభమయ్యే నంబర్లను మాత్రమే వాడాలి. సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్ల ద్వారా వచ్చే కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రాయ్ సూచించింది.

అమలు గడువు ఎప్పటి వరకు?

దేశంలోని అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కొత్త వ్యవస్థకు మారడానికి ట్రాయ్ 2026, ఫిబ్రవరి 15 వరకు గడువు విధించింది. ఈ తేదీ తర్వాత ఇన్సూరెన్స్ సేవల పేరిట సాధారణ నంబర్ల నుండి వచ్చే కాల్స్ అన్నీ అనధికారికమైనవిగా లేదా అనుమానాస్పదమైనవిగా పరిగణించవచ్చు.

ఇది కూడా చదవండి: Varanasi: రాజమౌళి–మహేష్ బాబు మూవీ ‘వారణాసి’పై జేమ్స్ కెమెరూన్ ఆసక్తి

ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలు:

10 అంకెల నంబర్ల నుండి కాల్స్ చేసి ‘మేము ఫలానా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులం’ అని నమ్మించే స్కామర్లను సులభంగా పట్టుకోవచ్చు. మార్కెటింగ్ కాల్స్‌కు, ముఖ్యమైన పాలసీ అప్‌డేట్ కాల్స్‌కు మధ్య తేడాను వినియోగదారులు సులభంగా అర్థం చేసుకోవచ్చు. అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే సమాచారం అందుతుంది కాబట్టి, ఓటీపీలు (OTP) లేదా వ్యక్తిగత వివరాలు అడిగే నకిలీ కాల్స్ నుండి రక్షణ లభిస్తుంది.

‘1600’ సిరీస్ ఎవరెవరు వాడుతున్నారు?

ఇప్పటికే ఆర్థిక రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ వ్యవస్థను పాటిస్తున్నాయి. RBI పరిధిలోని బ్యాంకులు, SEBI పరిధిలోని స్టాక్ మార్కెట్ సంస్థలు, PFRDA పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఈ 1600 సిరీస్ నంబర్లను వాడుతున్నారు. 

ప్రస్తుతం దాదాపు 570 సంస్థలు, సుమారు 3 వేల కంటే ఎక్కువ నంబర్లను ఈ సిరీస్‌లో వినియోగిస్తున్నాయి.  2026 ఫిబ్రవరి 15 తర్వాత, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మీకు కాల్ వస్తే.. ఆ నంబర్ ‘1600’ తో ప్రారంభమవుతుందో లేదో ఖచ్చితంగా చూసుకోండి. అప్రమత్తతే సైబర్ మోసాలకు విరుగుడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *