G.V. Babu

G.V. Babu: సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ‘బలగం’ ఫేమ్ జి.వి. బాబు కన్నుమూత

G.V. Babu: తెలుగు సినీ పరిశ్రమ మరోసారి విషాదంలో మునిగిపోయింది. ప్రముఖ రంగస్థల నటుడు, ‘బలగం’ సినిమాలో అంజన్న పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న జి.వి. బాబు (G.V. Babu) మరణించారు. కొంత కాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ, వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

బలగం సినిమాలో ప్రధాన పాత్రధారి ప్రియదర్శి చిన్నతాతగా కనిపించిన బాబు, సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆయన మృతిపై దర్శకుడు వేణు యెల్దండి సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రంగస్థల నటుడిగా జీవితాన్ని నాటకాలకే అంకితం చేశారు. బలగం మూవీతో వెండితెరపైకి తీసుకురావడం అదృష్టంగా భావిస్తున్నాను,” అంటూ తన సంతాపాన్ని తెలిపారు.

జి.వి. బాబు గత కొంతకాలంగా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మందులు, చికిత్స కోసం కుటుంబ సభ్యులు, వరంగల్ రంగస్థల కళాకారుల సంఘం మీడియా ద్వారా దాతల సహాయాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో దర్శకుడు వేణు కొంత సహాయం అందించినట్లు సమాచారం.

Also Read: Jailer 2: జైలర్ 2లో వివాదస్పద నటుడు.. మరోసారి సంచలనం!

G.V. Babu: ఇటీవలే ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ మృతి చెందగా, ఇప్పుడు జీవీ బాబు మరణ వార్తతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు, సహ నటీనటులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

జీవీ బాబు రంగస్థల కళాకారుడిగా సంవత్సరాలుగా అనేక నాటకాల్లో పాలు పంచుకున్నారు. నటనపై ఉన్న ఆసక్తి, ప్రతిభతో చివరికి సినిమాల్లోకి ప్రవేశించి ‘బలగం’ వంటి హిట్ సినిమాలో చోటు దక్కించుకున్నారు. ఆయన అభినయం, పాత్ర ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

జి.వి. బాబు గారికి శ్రద్ధాంజలి తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు పరిశ్రమ అంతటా సానుభూతి తెలుపుతోంది. రంగస్థల నటుడిగా ప్రారంభించి వెండితెరపై తన ముద్ర వేసిన బాబు, తెలుగు నాటకం, సినిమా అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *