Hyderabad: బెంగుళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), అతని భార్య శ్రావ్య (35) ఏడాదిన్నర క్రితం శంషాబాద్‌కు వచ్చారు. విజయ్ స్థానిక విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లయిన ఏడేళ్ల తర్వాత పిల్లలు కలగకపోవడంతో ఈ దంపతులు ఐవీఎఫ్ (IVF) పద్ధతి ద్వారా శ్రావ్య గర్భం దాల్చడంతో ఎంతో సంతోషించారు. ఆమె కడుపులో కవలలు పెరుగుతున్నారని తెలిసి వారి ఆనందానికి హద్దులు లేవు.
ప్రస్తుతం శ్రావ్య ఎనిమిది నెలల గర్భిణి. ఈ నెల 16న రాత్రి ఆమెకు ఆకస్మికంగా కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్తాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు శ్రావ్య గర్భంలోని కవలలు మరణించినట్లు నిర్ధారించారు. ఈ చేదు వార్తతో శ్రావ్య వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.
Also Read: Road Accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
చికిత్స పొందుతూ తల్లి మృతి
శ్రావ్యకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆమెను గుడిమల్కాపూర్‌లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఆమె కూడా ప్రాణాలు విడిచింది. కవల పిల్లల మరణంతో పాటు, భార్య కూడా చనిపోయిందన్న వార్త విని భర్త విజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
భార్య లేని జీవితం వ్యర్థమని..
భార్య, కవలలను కోల్పోవడంతో జీవితంపై విరక్తి చెందిన విజయ్, శంషాబాద్‌లోని తమ ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనను గుర్తించిన అతని మేనమామ పోలీసులకు సమాచారం అందించారు.
ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. బాల్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం… దంపతులు, వారి కవలల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విధి ఆడిన ఈ వింత నాటకంలో ఒకేసారి కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

