Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ అంటే కేజీఎఫ్ సినిమా తర్వాత దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న హీరో. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే, ఈ టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, అంతే వివాదానికి కూడా కారణమైంది.
మహిళా కమిషన్ ఆగ్రహం..
టీజర్ ప్రారంభంలో చూపించిన కొన్ని అశ్లీల దృశ్యాలు, మితిమీరిన బోల్డ్ సీన్లపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కారులో చిత్రీకరించిన ఇంటిమేట్ సీన్లు అసభ్యకరంగా ఉన్నాయని, ఇవి సమాజంపై చెడు ప్రభావం చూపుతాయని మండిపడింది. వెంటనే ఈ టీజర్‌ను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు కూడా లేఖ రాయడం ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది.
ఇది కూడా చదవండి: Anvesh: యూట్యూబ్ లో 8 కోట్లు సంపాదించా..
డార్క్ అండ్ బోల్డ్ లుక్‌లో ‘రాయ్’..
ఈ సినిమాలో యష్ ‘రాయ్’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మెషిన్ గన్‌తో ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషీ వంటి అగ్ర హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
యష్ రియాక్షన్ ఏంటి?
యష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సెన్సార్ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహిళా కమిషన్ డిమాండ్ మేరకు చిత్ర యూనిట్ టీజర్‌లోని ఆ సీన్లను కట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. కేజీఎఫ్ తర్వాత తన ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించాలని యష్ భావిస్తుంటే, ఈ వివాదం సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
