Bengaluru: కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరుపై మళ్లీ జలప్రళయం ప్రతాపం చూపింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. గత రెండు రోజులుగా కుండపోత వర్షాలతో నగరం అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు దక్షిణ ప్రాంతంలోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. యలహంకలోని కేంద్రీయ సదన్ వరదనీటిలో మునిగింది. ప్రజలు అనేక అవస్థలు పడుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్డీఆరెఫ్, ఎస్డీఆరెఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద సహాయక చర్యల్లో తలమునకలయ్యాయి. రెస్క్యూ బృందాలు పడవల్లో వరద బాధితులను బయటకు తీసుకొస్తూ సహాయక చర్యలు చేపడుతున్నాయి.
యలహంక, అల్లాల సండ్ర, హెబ్బాల, హెన్నూరు, నాగవార, ఓఆరార్ వంటి ప్రాంతాలు కూడా పూర్తిగా నీటమునిగాయి. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల రోడ్లపై వరదనీటిలో కొట్టుకొచ్చిన చేపలను వలలతో పలువరు నగరవాసులు పట్టుకుంటున్నారు.

