Free Tomatoes: ఒకప్పుడు ధరలతో సామాన్యుడిని వణికించిన టమాటా, నేడు అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తోంది. మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్‌లో టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీసం పెట్టుబడి పక్కన పెడితే, మార్కెట్‌కు తీసుకొచ్చే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు దయనీయ స్థితిలో వినూత్న నిరసనకు దిగారు.
పెట్టుబడి రాక.. కూలి గిట్టక!
మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి రైతులు భారీగా టమాటాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. అయితే, ఒక్కసారిగా సరఫరా పెరగడం లేదా డిమాండ్ తగ్గడంతో ధరలు భారీగా పతనమయ్యాయి.
మార్కెట్‌లో కిలో టమాటా ధర కేవలం రూ. 2 నుండి రూ. 3 లోపు పలుకుతుండటంతో రైతులు షాక్‌కు గురయ్యారు. పంటను కోయడానికి పట్టే కూలి, మార్కెట్‌కు తరలించే లారీ లేదా ఆటో ఖర్చులు కూడా ప్రస్తుత ధరతో రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు వేల రూపాయల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులకు, ఇప్పుడు వందల్లో కూడా ఆదాయం రాకపోవడంతో గుండె పగిలినంత పనవుతోంది.
రోడ్డుపైనే టమాటాలు.. వినూత్న నిరసన
తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన రైతులు, వాళ్ళు తెచ్చిన టమాటాలలో 1200కేజీలు అక్కడ జరిగే వారాంతపు సంతలో వచ్చిన జనాలకి ఉచితంగా ఇచ్చేశారు. ఉచితంగా టమాటాలు ఇవ్వడంతో అక్కడ జనాలు ఎగ్గబడి మరి తీసుకున్నారు.. కొందరు చీర కొంగులో ,కొంతమంది గంపలతో తీసుకోని వెళ్లిపోయారు.
నిపుణుల విశ్లేషణ
సాధారణంగా దిగుబడి ఎక్కువగా ఉన్న సమయంలో నిల్వ చేసుకునే సౌకర్యాలు (Cold Storage) లేకపోవడం వల్ల రైతులు ఇలాంటి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. టమాటా వంటి త్వరగా పాడైపోయే పంటల విషయంలో ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే రైతులకు ఈ కష్టాలు తప్పుతాయని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
