Tollywood:సినీ కార్మికుల కొన్ని సడలింపులకు ఒప్పుకున్నా.. సినీ నిర్మాతలు అంగీకారానికి రాలేదు. దీంతో సమ్మె కొనసాగుతూనే ఉన్నది. ఈ రోజు (ఆగస్టు 19) కూడా సినీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ శివనేకర్ రహదారిని దిగ్బంధం చేసిన 23 క్రాఫ్ట్స్ కార్మికులు నిరసనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
Tollywood:సినీకార్మికుల నిరసన కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడారు. అగ్రనటుడు చిరంజీవితో తాము మూడు గంటలకు పైగా సమావేశం అవుతామని, చాంబర్ ప్రతినిధులతో నాలుగు గంటలకు సమావేశానికి వెళ్లాల్సి ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ తరఫున నిన్ననే చర్చలు జరిపారు. మళ్లీ చర్చలకు వెళ్తున్నట్టు అనిల్‌కుమార్ ప్రకటించడం గమనార్హం.
Tollywood:చిరంజీవితో, చాంబర్ ప్రతినిధులతో జరిగే సమావేశాల్లో తమ డిమాండ్లను వారి ముందుంచుతామని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ తెలిపారు. 13 కోట్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇప్పటికే వారికి కొన్ని సడలింపులను తెలిపామని, అవి మీకందరికీ సమ్మతమేనా? అని ప్రశ్నించగా, అందరూ అంగీకరిస్తున్నట్టు తెలిపారు.
Tollywood:ఫైటర్లు, డ్యాన్సర్లు రేషియో విషయంలో స్థానికులు లేకపోతే ఇతర రాష్ట్రాల వారిని తీసుకునేందుకు అంగీకరించామని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వెల్లడించారు. నిర్మాతలకు ఇష్టమైన సామర్థ్యం ఉన్న వారిని నియమించుకునుందుకు కూడా అంగీకరించినట్టు తెలిపారు. ఆదివారం డబుల్ పేమెంట్ ఇవ్వబోమంటున్నారని, దానికి కూడా ఒప్పుకుంటున్నామని తెలిపారు.
Tollywood:అగ్రనటుడు చిరంజీవి రంగంలోకి దిగడం, కార్మికులు పట్టువిడుపులను సడలించుకోవడం, నిర్మాతలు కూడా కొంత దిగిరావాలన్న సినీపెద్దల సూచనతో ఈ రోజు (ఆగస్టు 19) జరిగే చర్చలు కీలకం కానున్నాయని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చర్చల అనంతరం సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. సమ్మె విరమించేలా అన్ని వైపుల నుంచి చొరవ చూపుతున్నట్టు తెలుస్తున్నది.