Khairatabad Ganesh: హైదరాబాద్ ఖైరతాబాద్‌లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిచ్చే బడా గణేశ్ 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులను అలరించనున్నాడు. 84 రోజుల పాటు 125 మంది కళాకారులు శ్రమించి ఈ మహా గణనాథుడిని తీర్చిదిద్దారు.
నేడు తొలి పూజ – ప్రాణప్రతిష్ఠ
వినాయక చవితి రోజు ఉదయం 6 గంటలకు తొలిపూజ జరగనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు ఖైరతాబాద్ గణేషుడికి ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు తెలంగాణ గవర్నర్ విశ్వనాథన్ దేవ్ వర్మ హాజరుకానున్నారు. 20 మంది సిద్ధాంతిలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
త్రిశక్తి సమేత మహాగణపతి
ఈ ఏడాది గణనాథుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి త్రిశక్తి సమేతుడిగా రూపుదిద్దుకున్నాడు. గణపతికి ఇరువైపులా జగన్నాథస్వామి సుభద్ర, బలరాములతో, లక్ష్మీ సమేత హయగ్రీవస్వామి, అలాగే ఖైరతాబాద్ గ్రామదేవతగా పూజించే గజ్జెలమ్మ అమ్మవారు ప్రతిష్టించబడ్డారు.
చారిత్రక ప్రస్థానం
1954లో కేవలం ఒక అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశ్ ప్రస్థానం, ఆపై దశాబ్దాల పాటు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెరుగుతూ 60 అడుగుల ఎత్తుకు చేరింది. 2014 నుంచి భక్తుల సౌలభ్యం దృష్ట్యా ఒక్కో అడుగు తగ్గించే విధానం పాటిస్తున్నారు. ఈసారి గణనాథుడు 69 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించబడడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రత్యేక పూజలు – హోమాలు
తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల హోమాలు నిర్వహించనున్నారు. అలాగే కాశీ నుంచి తెచ్చిన లక్ష రుద్రాక్షలను గణపయ్య మెడలో ధరింపజేయనున్నారు. గణనాథుడి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురోహితులు లక్ష వినాయక నామార్చన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతం గణపతికి సమర్పించనున్నారు.
భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఖైరతాబాద్‌లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులు, 100 మంది ప్రైవేటు సిబ్బంది, 60 సీసీ కెమెరాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
ట్రాఫిక్ నియంత్రణలు
ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీని బట్టి వాహనాలను మళ్లించే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
