Tirumala: టీటీడీ కీలక ప్రకటన – వైకుంఠ ద్వార దర్శన టికెట్లు వాయిదా

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్ల విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవాలని ప్లాన్‌ చేసుకున్న భక్తులు కొత్త తేదీల కోసం వేచి చూడాల్సి ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ల జారీని నిలిపివేసింది. కొన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

టికెట్ల జారీకి సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని, భక్తులు ఈ మార్పును గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇక తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుంటున్నారు. కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా దర్శనం సాఫీగా సాగుతోందని అధికారులు తెలిపారు.

గత మంగళవారం ఒక్కరోజే 63,837 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీరిలో 20,904 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీకి రూ.2.85 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *