Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే విధంగా దేశంలోనే తొలిసారిగా ‘ది`వ్య వృక్షాల ప్రాజెక్టు’ ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. హిందూ దేవాలయాల నిర్మాణంలో అత్యంత కీలకమైన ధ్వజస్తంభాల కోసం అవసరమైన పవిత్ర వృక్షాలను స్వయంగా పెంచడం, పరిరక్షించడమే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు ఈ విశిష్ట ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ దివ్య వృక్షాల పెంపకం ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది అని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు అన్నారు.
ధ్వజస్తంభం ఆధ్యాత్మిక ప్రాధాన్యం
హిందూ ఆలయాల్లో ధ్వజస్తంభానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది కేవలం నిర్మాణాత్మక అంశం కాదు భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఆలయ ప్రాంగణంలో నిటారుగా ఉండే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది. ఆగమశాస్త్రాల ప్రకారం, ధ్వజస్తంభాన్ని నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో మాత్రమే తయారు చేయాలి.
ఇది కూడా చదవండి: Abhishek Sharma: అభిషేక్ శర్మ సంచలనం: టీ20ల్లో అత్యంత వేగంగా
వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, సంవత్సరాల తరబడి సంరక్షించి, శాస్త్రోక్తంగా పూజించిన అనంతరం ధ్వజస్తంభంగా రూపొందిస్తారు. రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ధ్వజారోహణం సమస్త లోకాల్లోని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది.
ధ్వజస్తంభాల తయారీకి అనువైన వృక్షాలు
ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా ఈ క్రింది రకాల వృక్షాలను ఉపయోగిస్తారు:
-
టేకు (Teak)
-
ఏగిశా/ ఇండియన్ కినో (Indian Kino)
-
టెర్మినేలియా (Terminalia)
-
షోరియా (Shorea)
ఈ వృక్షాలు బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత, ఈ కాండాన్ని స్వర్ణ కవచంతో అలంకరించి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వంటి పవిత్ర ఆలయాల్లో ప్రతిష్ఠిస్తారు.
ప్రాజెక్టు దూరదృష్టి, లక్ష్యాలు
దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను నిర్వహిస్తున్న టీటీడీ, భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించే ప్రణాళికలో ఉంది. ఈ దూరదృష్టితోనే ‘దివ్య వృక్షాల ప్రాజెక్టు’ను ప్రారంభిస్తున్నారు.
ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను బయట నుంచి సేకరించకుండా, టీటీడీ స్వయంగా పెంచి, సంస్థాగత స్వావలంబనను సాధించడం.
కాలక్రమేణా మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో, శాస్త్రోక్తంగా పెంచిన కొత్త పవిత్ర వృక్షాలతో తయారు చేసిన ధ్వజస్తంభాలను ఏర్పాటు చేయడం. టీటీడీ నిర్మించనున్న కొత్త ఆలయాల కోసం అవసరమైన పవిత్ర కలపను ముందుగానే సిద్ధం చేయడం.
ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో రికార్డు సృష్టించనుంది. దీని ద్వారా ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత తరతరాలకు కొనసాగుతాయని టీటీడీ స్పష్టం చేసింది.
