BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ, శ్రీవారి లడ్డూల తయారీలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు, ఈ వ్యవహారం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు.
గత పాలకులు నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టారని, కాసుల కక్కుర్తితో భోలే బాబా డెయిరీని ఎంచుకుని కల్తీ నెయ్యి సరఫరా జరిగేలా చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ డెయిరీపై జరిగిన తనిఖీల్లో ఒక్క ఆవు కూడా లేదని తేలిందని, అలాంటప్పుడు 60 లక్షల కిలోల నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నట్లు ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నదని, ఆ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడారని తెలిపారు.
బీఆర్ నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో కల్తీ నెయ్యితో దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని, ఇది మహా పాపమని అన్నారు. నెయ్యిలో నూటికి నూరు శాతం కల్తీ జరిగిందని, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను కూడా వాడినట్టు నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాల వల్ల కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Tirumala: అలర్ట్.. మార్చి 3న శ్రీవారి ఆలయం క్లోజ్
ఈ మొత్తం వ్యవహారంలో సుమారు రూ.250 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. వైసీపీ పెద్దల సహకారం లేకుండా ఇలాంటి పని జరగదని వ్యాఖ్యానించారు. గత తితిదే ఛైర్మన్‌తో పాటు మరికొందరి పాత్రపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్ప ఖాతాలోకి కోట్ల రూపాయలు వచ్చాయని, ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో సీబీఐ వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాల వెనుక ఉన్న వారి పేర్లు బయటపెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థను కోరుతున్నామని తెలిపారు.
వైసీపీ నేతలు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్న తీరును బీఆర్ నాయుడు తప్పుబట్టారు. తప్పులు చేసి ఇప్పుడు భూమన యాగాలు చేస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. గత పాలకులు తిరుమల తిరుపతి దేవస్థానంపై కుట్రలు చేశారని, హిందూ సమాజానికి వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చిందని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అప్పటివరకు ఈ అక్రమాలు నిర్భయంగా కొనసాగాయని అన్నారు. దుర్మార్గుల నుంచి తితిదేని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.
