Tirumala: తిరుమల క్షేత్రం అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినానికి ముస్తాబైంది. కలియుగ వైకుంఠంగా పిలవబడే శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అనగా మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలను (ఉత్తర ద్వారం) అర్చకులు శాస్త్రోక్తంగా తెరవనున్నారు. స్వామివారికి ఏకాంతంగా పూజా కైంకర్యాలు ముగిసిన అనంతరం, ముందుగా వీఐపీలకు, ఆపై ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులకు ఈ విశేష దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం పది రోజుల పాటు, అంటే జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు వైకుంఠ ద్వార దర్శనం అందుబాటులో ఉండనుంది.
వైకుంఠ ఏకాదశి రోజున మంగళవారం ఉదయం శ్రీమలయప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం బుధవారం ద్వాదశి పర్వదినం సందర్భంగా వేకువజామున శ్రీవారి పుష్కరిణిలో పవిత్ర ‘చక్రస్నానం’ నిర్వహిస్తారు. ఈ పది రోజుల పాటు రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని రకాల ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. కేవలం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే నిర్ణీత సమయాల్లో అనుమతిస్తారు. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు) టోకెన్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉండగా, జనవరి 2 నుంచి సర్వదర్శనం భక్తులకు అవకాశం కల్పిస్తారు.
Also Read: TG Assembly: 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్.. వాడీవేడి చర్చలకు సిద్ధమైన శాసనసభ
భక్తుల సౌకర్యార్థం తిరుమలను టీటీడీ సుందరంగా తీర్చిదిద్దింది. సుమారు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 లక్షల కట్ ఫ్లవర్స్‌తో ఆలయ పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. ఆలయం వెలుపల శ్రీరంగనాథ స్వామి ఆలయ నమూనాను, అష్టలక్ష్ముల విగ్రహాలను ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. భక్తుల ఆకలి తీర్చేందుకు నిరంతర అన్నప్రసాద వితరణతో పాటు, రోజుకు రికార్డు స్థాయిలో 4.40 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచారు.
గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 2.63 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.1387 కోట్ల ఆదాయం లభించింది. ఈ వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో భారీ భద్రతా ఏర్పాట్లు, వాలంటీర్ల నియామకం చేపట్టారు. టోకెన్లు పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయం ప్రకారం కృష్ణతేజ, ఏటీజీహెచ్ (ATGH), శిలాతోరణం మార్గాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
