Tirumala:తిరుమల శ్రీవారి ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేయనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజున చంద్రగ్రహణం ఉండటంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6:47 నిమిషాలకు పూర్తవుతుందని టీటీడీ తెలిపింది. సాధారణంగా గ్రహణం సమయంలో ఆలయాలను ముందుగానే మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ సంప్రదాయం ప్రకారం గ్రహణానికి సుమారు ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేస్తారు. అందుకే మార్చి 3వ తేదీన ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో ఎలాంటి దర్శనాలు జరగవు.
కాబట్టి తిరుమల వెళ్లాలని ప్లాన్ చేసుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఆ రోజు టికెట్లు బుక్ చేసుకున్నవారు దర్శనం కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చే అవకాశం ఉంది. దర్శనం మరుసటి రోజు జరిగే పరిస్థితి కూడా ఉండటంతో భక్తులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికను సర్దుబాటు చేసుకోవడం మంచిదని సూచించారు.
