TTD Ghee Scam: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి సంచలనం రేపుతోంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఈ రూ. 235 కోట్ల కుంభకోణంపై ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సిట్ (SIT) విచారణ జరుగుతుండగా, తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (Enforcement Directorate) రంగంలోకి దిగింది. భారీ ఎత్తున హవాలా మరియు మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు దొరకడంతో ఈడీ ఈ కేసును టేకాఫ్ చేసింది.
68 లక్షల కిలోల కల్తీ నెయ్యి: సిట్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయింది. అగ్మార్క్ గ్రేడ్ అని నమ్మించి, పామాయిల్ మరియు కెమికల్స్ కలిపిన నెయ్యిని భోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ అనే సంస్థ సరఫరా చేసింది. దీని మొత్తం విలువ సుమారు రూ. 234.51 కోట్లుగా అధికారులు గుర్తించారు.
హవాలా మార్గంలో లంచాలు: ఈ అక్రమ వ్యాపారం సాఫీగా సాగడానికి నిందితులు టీటీడీలోని కొందరు అధికారులకు భారీగా లంచాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. భోలే బాబా డైరీ డైరెక్టర్లు తమ ఏజెంట్ల ద్వారా హవాలా మార్గంలో ఈ సొమ్మును పంపిణీ చేశారని సిట్ ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ నగదు బదిలీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడమే ఇప్పుడు ఈడీ ప్రధాన లక్ష్యం.
ఇది కూడా చదవండి: Gold & Silver Rate: దెబ్బకు లక్ష తగ్గిన ధరలు.. బంగారం తులం ధర ఏంటంటే?
ఆస్తుల జప్తుపై ఈడీ గురి: కల్తీ నెయ్యి ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో నిందితులు విశాఖపట్నం, అనకాపల్లి వంటి ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ అనుమానిస్తోంది. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద నిందితుల బ్యాంక్ ఖాతాలను, స్థిరాస్తులను జప్తు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సిట్ నుంచి 36 మంది నిందితుల వివరాలు మరియు రిమాండ్ రిపోర్టులను ఈడీ సేకరించింది.
భక్తుల ఆవేదన – రాజకీయ చర్చ: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కుంభకోణంలో మరిన్ని ‘పెద్ద తలకాయల’ పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విదేశాలకు ఏమైనా నిధులు మళ్లాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగనుంది. త్వరలోనే నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనుంది.
