తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించారనే వార్తలపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కీలక కామెంట్స్ చేశారు. తిరుమల ప్రసాదాల క్వాలిటీపై గతంలో తాను ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని అయినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయిందన్నారు. తోటి అర్చకులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడంతో తనదే ఒంటరి పోరాటం అయిందని తెలిపారు.
గత 5 ఏళ్ళలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు, ప్రసాదం వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది. వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామి వారికి మా చేతులతో, ఆ కల్తీని నైవేద్యంగా పెట్టాం అంటే ఇది దురదృష్టం. ఈ కల్తీ నెయ్యితో లడ్డూ మాత్రమే కాదు, ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు. చివరకు స్వామి వారి… pic.twitter.com/EXbfuOoWTX
— Telugu Desam Party (@JaiTDP) September 20, 2024
తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో శుక్రవారం రమణదీక్షితులు మాట్లాడారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తంచేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానన్న రమణ దీక్షితులు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉందన్నారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పుకొచ్చారు.
తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని.. దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టారని తెలిపారు. కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని ఆయన కొనియాడారు. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రమణ దీక్షితులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తనపై హింసలు పెట్టిందని.. వాటిని ఎత్తి వేయాలని కోరారు.