Hyderabad Accident

Hyderabad Accident: గోడ కూలి ముగ్గురు మృతి..

Hyderabad Accident:  హైదరాబాద్ ఎల్బీనగర్‌ డిజిజన్ మన్సురాబాద్ సైట్ నెం. 59లో వాణిజ్య నిర్మాణం కోసం సెల్లార్‌లో తవ్వకాలు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. కాగా మరణించిన వారు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సెల్లార్‌లో సుమారు 10 మంది కార్మికులు తవ్వకాలు చేపట్టగా మట్టి పెళ్లలు కూలి ప్రమాదం జరిగినట్లుగా తెలిసింది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా సీతారామాపురం తండా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: AP Ministers Ranks: చంద్రబాబు మంత్రుల పనితీరుకు ర్యాంకింగ్.. పవన్ ర్యాంక్ ఎంతంటే

ఈ ఘటనపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వకం ప్రారంభించడం వల్లే గోడ కూలినట్లు జీహెచ్ఎంసీ నిర్ధారించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడం, ఒకరు గాయపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ, భవన యజమానులైన కుసమ రమేశ్, కుసుమ విజయ్​తో పాటు బిల్డర్ సిద్ధం సాయినాథ్​పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులకు లేఖ రాశారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, ప్రాణ నష్టానికి కారణాలపై యజమానికి షోకాజు నోటీసులు జారీ చేయడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.

ప్లాట్ నెం.36లో 2 సెల్లార్​లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 4 పై అంతస్తులతో కూడిన భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారని, అయితే సెల్లార్ తవ్వకానికి సంబంధించి సైట్ వద్ద అవసరమైన భద్రత, జాగ్రత్త చర్యలు తీసుకోలేదని జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇందుకు సంబంధించి నోటీసు జారీ చేసినప్పటికి పట్టించుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్ల ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని జీహెచ్ఎంసీ తెలిపింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *