Rajnath Singh: ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక ప్రజలు బలయ్యారు. ఈ దాడిలో పాలుపంచుకున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు అద్భుతంగా అమలుచేసిన ఆపరేషన్‌లో మట్టుబెట్టాయి. ఈ విజయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటించారు.
రాజ్యసభలో ‘ఆపరేషన్ సిందూర్’ పై చర్చ ప్రారంభించిన ఆయన, “ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గామ్ దాడికి బాధ్యులు. వారిని మట్టుబెట్టిన మన సైన్యాన్ని అభినందిస్తున్నా. ఇది దేశ భద్రత కోసం తీసుకున్న దట్టమైన చర్య,” అన్నారు.
దాడి తర్వాత ప్రధాని మోదీ, సైనికాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారని, ప్రాంతీయ భద్రతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. “ఇది విస్తరణవాద చర్య కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలనే మన లక్ష్యం. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుంది. కానీ, భద్రత విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గదు” అన్నారు.
పాకిస్థాన్‌కు స్పష్టమైన హెచ్చరిక
మే 10న భారత వాయుసేన పాకిస్తాన్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై తీవ్ర దాడులు చేసింది. దాంతో పాకిస్థాన్ వెనక్కి తగ్గి, DGMO చానల్ ద్వారా భారత్‌ను దాడులు ఆపాలని అభ్యర్థించింది. దానికి అనుగుణంగా భారత ప్రభుత్వం తాత్కాలికంగా ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేసింది.
ఇది కూడా చదవండి: Minister bala: పెట్టుబడుల పేరుతో వైసీపీ నేతలు విహారయాత్ర చేశారు
“భవిష్యత్తులో పాక్ మళ్లీ ఉగ్రదాడులకు పాల్పడితే, ఆపరేషన్ సిందూర్ మరింత బలంగా తిరిగి ప్రారంభమవుతుంది. భారత్‌లో ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం లేదు” అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
రక్షణ రంగంలో భారత్ పురోగతి
భారత రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. 2014లో రూ.686 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు జరిగితే, ఇప్పుడు అది రూ.24 వేల కోట్లకు చేరిందని, లక్ష్యం రూ.50 వేల కోట్లు అని తెలిపారు. దేశం ఆత్మనిర్భర్ లక్ష్యం వైపు వేగంగా ముందుకెళ్తోందన్నారు.
విపక్షాలకు సందేశం
దేశ భద్రత విషయంలో రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. “ఇదొక రణరంగం. ఇక్కడ మనమంతా భారతీయులం. సైన్యం పక్కన నిలబడి, మనం కట్టుబాటుగా వ్యవహరించాలి” అని అన్నారు.