Annamayya District: సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీరామనవమి ఊరేగింపులో భాగంగా భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఈ చిన్నారులు నీటికుంటలో స్నానానికి వెళ్లి అనుకోకుండా అందులో పడి మునిగిపోయి ప్రాణాలు విడిచారు.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలం ఎం. రాచపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవమూర్తులను గ్రామస్థులంతా కలిసి ఊరేగించారు. సరిగ్గా అదే సందర్భంలో ముగ్గురు చిన్నారులు నీటి కుంటలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత అనుకోకుండా వారు అందులో పడి మునిగిపోయారు.
ఆలయం దగ్గర ఉన్నారేమోనని భావించిన కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసి ఆలయ మైకులో వారి పేర్లు చెప్పించారు. అయినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు లబోదిబోమన్నారు.
గ్రామస్థుల సహకారంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించి నీటి కుంటలో పడి ఉన్న చిన్నారులను చూసి నిర్ఘాంతపోయారు. హుటాహుటిన ముగ్గురు చిన్నారులను పుల్లంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ముగ్గురు చిన్నారుల మృతితో ఒక్కసారిగా వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఎన్డీఏ కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు సెలవు దినాలలో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

