Nepal: నేపాల్‌లో 2008 వరకు రాచరిక పాలన అమల్లో ఉండేది. అయితే, తీవ్ర ప్రజా ఉద్యమం కారణంగా రాజు గద్దె దిగిపోవడంతో, ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి 17 సంవత్సరాలు పూర్తికావస్తున్నా, నేపాల్‌లో తిరిగి రాచరిక పాలన కావాలనే డిమాండ్ పెరుగుతోంది.
రాచరికానికి మద్దతుగా భారీ ర్యాలీ
రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (RPP) రాచరికాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫోటోలతోపాటు, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కూడా ప్రదర్శించారు. ఈ పరిణామం నేపాల్‌లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక భారతీయ రాజకీయ నేత ఫోటోలు, నేపాల్‌లోని రాచరిక మద్దతుదారుల ర్యాలీలో కనిపించడం అందరిలో ఆసక్తిని రేపింది.
Nepal: యోగి ఆదిత్యనాథ్, నేపాల్ రాచరికానికి బలమైన మద్దతుదారుగా భావించబడుతున్నారు. జ్ఞానేంద్ర షాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు, ఇటీవల జరిగిన ఘటనలు సూచిస్తున్నాయి. జనవరిలో జ్ఞానేంద్ర షా భారత పర్యటన సందర్భంగా, ఆయన యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి, ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే యోగి ఫోటోలు ర్యాలీలో కనిపించడం, మరింత చర్చనీయాంశమైంది.
Also Read: Vemula Veeresham: ఎమ్మెల్యే వేములను బ్లాక్ మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు
నేపాల్‌లో రాచరికాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతున్న RPP పార్టీ, ఈ ర్యాలీ ద్వారా తమ డిమాండ్‌ను మరింత బలంగా వ్యక్తం చేసింది. అయితే, యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కనిపించడం, అనేక విమర్శలకు తావిచ్చింది. RPP పార్టీ ప్రతినిధులు దీనిపై స్పందిస్తూ, ప్రధానమంత్రి కేపీ ఓలీ వర్గం తమ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఈ కుట్ర చేసింది అని ఆరోపించారు. ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ సూచన మేరకే యోగి ఫోటోలు ప్రదర్శించారని అన్నారు. అయితే, బిష్ణు రిమాల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.
ఇటీవల, కాఠ్‌మాండూ, పోఖరా సహా నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో రాచరిక పునరుద్ధరణకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించటం విశేషం. 2008లో తీవ్రమైన ప్రజా ఉద్యమం కారణంగా రాజు పాలన అంతమైంది. అయినప్పటికీ, రాచరిక పునరుద్ధరణకు మద్దతుగా జరుగుతున్న ఈ ఉద్యమాలు, నేపాల్‌లో రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

