Pongal 2025: తెలుగులో మాదిరిగానే ఈసారి తమిళనాట కూడా పొంగల్ బరిలో దిగే సినిమాల విషయంలో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అజిత్ నటిస్తున్న ‘విదా ముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలు తుది దశకు చేరుకున్నాయి. వీటిల్లో ఏదో ఒకటి పొంగల్ కు రావడం ఖాయమంటున్నారు. అలానే విక్రమ్ నటిస్తున్న ‘వీర ధీర శూరన్ -2’ చిత్రమూ పొంగల్ కే వస్తోంది. దీనితో పాటు ఇటీవల ‘సత్యం సుందరం’ చిత్రంతో తెలుగువారిని పలకరించిన కార్తీ మూవీ ‘వా వాతియారే’ సంక్రాంతికే రాబోతోంది. ఇక కమల్ హాసన్ – శంకర్ కాంబోలో రూపుదిద్దుకున్న ‘భారతీయుడు -3’ ఓటీటీలో వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సమయంలో కమల్ హాసన్, మణిరత్నం మూవీ ‘థగ్ లైఫ్’ పొంగల్ బరిలో దిగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇటు తెలుగులో బాలకృష్ణ, వెంకటేశ్, రామ్ చరణ్, నాగచైతన్య, సుమంత్, సందీప్ కిషన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ డబ్బింగ్ సినిమాలు ఇక్కడా సంక్రాంతికే విడుదల కావాలంటే థియేటర్లు దొరకని పరిస్థితి. సో… ఒక వారం లేదా రెండు వారాలు ఆలస్యంగా అవి తెలుగునాట విడుదల కావచ్చు.
