Bamboo Salt: వంటలకు తప్పనిసరిగా వాడే ఉప్పు ధర ఎంత ఉంటుంది? మహా అయితే కిలోకు రూ.20 నుండి రూ.30 ఉండవచ్చు. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటుంది. దాని పేరు కొరియన్ బాంబూ సాల్ట్ . ఈ అరుదైన ఉప్పు ధర కిలోకు ఏకంగా రూ.35,246 ($400) వరకు ఉంటుంది. ఈ ఉప్పును జుగ్యోమ్ లేదా పర్పుల్ బాంబూ సాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇంతకీ దీనికి ఎందుకు అంత ధర?
ఈ ఉప్పు తయారీ అనేది ఒక సుదీర్ఘమైన శ్రమతో కూడిన ప్రక్రియ. దీనిని తయారు చేయడానికి సుమారు 50 రోజులకు పైగా పడుతుంది. ఈ ప్రక్రియను నైపుణ్యం కలిగిన కార్మికులు మాత్రమే చేయగలరు. మొదట, కొరియా పశ్చిమ తీరం నుండి సముద్రపు ఉప్పును సేకరించి, వాటిని మందపాటి వెదురు బొంగుల్లో నింపుతారు. ఆ తర్వాత వాటిని పసుపు లేదా ఎరుపు బంకమట్టితో మూసివేస్తారు. ఈ వెదురు బొంగులను ఇనుప ఓవెన్‌లలో ఉంచి, పైన్‌వుడ్ మంట సహాయంతో తొమ్మిది సార్లు కాలుస్తారు. ప్రతిసారి కాల్చిన తర్వాత, గట్టిపడిన ఉప్పును తీసి, పొడిగా చేసి, మళ్ళీ వెదురు బొంగుల్లో నింపి తిరిగి కాలుస్తారు.
మొదటి ఎనిమిది సార్లు కాల్చేటప్పుడు ఉష్ణోగ్రత 1,000°C వరకు చేరుకుంటుంది. చివరిగా, తొమ్మిదోసారి, ఉప్పును 1,500°C లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద ఉప్పు కరిగిపోయి, వెదురు, పైన్‌వుడ్ నుండి పోషకాలను, తీపి రుచిని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఉప్పు ఒక ప్రత్యేకమైన ఊదా రంగులో మారి పర్పుల్ బాంబూ సాల్ట్’గా తయారవుతుంది.
ఈ ఉప్పు ఖరీదుకు అనేక కారణాలు ఉన్నాయి. దాని తయారీకి పట్టే ఎక్కువ సమయం, శ్రమ, ప్రత్యేక నైపుణ్యంతో పాటు, అధిక నాణ్యత గల వెదురు, పైన్‌వుడ్, ఇతర పదార్థాలు కూడా దీని ధరను పెంచుతాయి. అంతేకాకుండా, ఈ ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్ముతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో, శరీరంలో ఆమ్లత్వాన్ని తగ్గించి pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే దీనికి ఇంత డిమాండ్, మరియు అధిక ధర.