Maha Kumbh Mela 2025: ఆకాశం నుంచి కురుస్తున్న పూల వర్షం.. ఒక్కో పూల రేకు ఒక్కో భక్తునిలా మారిందా అన్నట్టు ప్రయాగ్ రాజ్ నేలంతా భక్త జన సందోహం. ఆకాశం నుంచి పూలవర్షంతో పాటు లక్షలాది మంది సాధుపుంగవులు ఎక్కడి నుంచో కిందికి వచ్చారా అన్నట్టుగా పరిస్థితి. ఇసుక వేస్తే రాలదు.. నేల ఈనింది.. అనే వాడుక వాక్యాలు కూడా చిన్నబోయాయి.. అక్కడ జనాన్ని చూసి. అసలు ఈ జనసందోహాన్ని వర్ణించాలంటే పదాలు దొరికే ఛాన్స్ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇదంతా మాహాకుంభమేళా లో వసంత పంచమి సందర్భంగా కనిపిస్తున్న భక్త జన కోటికి సంబంధించిన సమాచారం.
మహాకుంభమేళా సందర్భంగా మూడవ- చివరి అమృత స్నాన ఉత్సవం.. వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం కోలాహలంగా కొనసాగుతోంది. చేతిలో ఖడ్గం, డోలు, శంఖం. శరీరం మీద విభూతి.. కళ్లకు నల్ల అద్దాలు. గుర్రాల మీద స్వారీ.. రథాల సవారీ. . హర హర మహాదేవ్ అని జపిస్తూ ఋషులు – సాధువులు లక్షలాదిగా స్నానానికి పవిత్ర సంగం దగ్గరకు చేరుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Basant Panchami 2025: వసంత పంచమి . . పండుగ ఎందుకు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం . .
ముందుగా పంచాయతీ నిరంజని అఖారాకు చెందిన సాధువులు సంగమానికి చేరుకున్నారు. అప్పుడు కిన్నార్ అఖారాతో పాటు అతిపెద్ద జునా అఖారా అమృత స్నానం చేసింది. 13 అఖారాలు ఒక్కొక్కటిగా స్నానం చేస్తాయి. సాధువుల దీవెనలు పొందేందుకు లక్షలాది మంది భక్తులు సంగమంలో ఉన్నారు. నాగ సాధువుల పాదాల ధూళిని తమ నుదుటిపై పూసుకుంటున్నారు. అమృత్ స్నాన్‌ను చూసేందుకు 20కి పైగా దేశాల నుంచి ప్రజలు కూడా సంగం చేరుకున్నారు. హెలికాప్టర్ నుంచి సంగమం వద్ద పూలవర్షం కురిపించారు.
Maha Kumbh Mela 2025: సంగమానికి వెళ్లే అన్ని మార్గాల్లో 10 కిలోమీటర్ల మేర భక్తుల సందడి నెలకొంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ నుంచి 8 నుంచి 10 కిలోమీటర్లు నడిచి సంగం చేరుకుంటున్నారు. జనసందోహాన్ని చూసి హనుమాన్ ఆలయాన్ని మూసివేశారు. జాతర ప్రాంతంలోని అన్ని రహదారులు వన్-వేగా మారిపోయాయి. సగం చేరుకునే దారి ఒకటైతే, అక్కడ నుంచి బయటకు వచ్చే దారి మరోటీగా ఏర్పాటు చేశారు.
మహా కుంభమేళాలో 60 వేల మందికి పైగా సైనికులు మోహరించారు. అఖండ జనసందోహానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి 100 మందికి పైగా కొత్త ఐపిఎస్‌లను కూడా నియమించారు. హెలికాప్టర్ నుంచి జనాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2750 సీసీటీవీలను కూడా ఏర్పాటు చేశారు. లక్నోలోని సీఎం నివాసంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. యోగి స్వయంగా డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ అధికారులతో కలిసి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వసంత పంచమి నాడు ఉదయం 8 గంటల వరకు 52.25 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. నేడు మహాకుంభమేళా 22వ రోజు. జనవరి 13 నుంచి ఇప్పటి వరకు 34.97 కోట్ల మంది ప్రజలు స్నానాలు చేశారు. ఈరోజు 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు సంగమంలో స్నానమాచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.