Sarpanch Elections: ఎలక్షన్ల సమయంలో గొడవలు సహజమే.. తెలంగాణలో ఇప్పటికే జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల తర్వాత, గెలిచిన అభ్యర్థుల తరపు జనం లేదా కొన్నిసార్లు సొంత కుటుంబ సభ్యులే ఓడిపోయిన అభ్యర్థిని, వారికుటుంబ సభ్యులని వాళ్ళకి సపోర్ట్ చేసిన వ్యక్తులను కొట్టడం వంటి ఘటనలు నిన్నటివరకు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈరోజు మూడో విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి, ఓటు వేయడానికి వచ్చిన ఒక ఓటరుపై చేయి చేసుకున్న వింత ఘటన చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే? ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన ఒక వ్యక్తిపై సర్పంచ్ అభ్యర్థి దాడికి దిగాడు. సదరు ఓటరు మొదట తన గుర్తింపు కార్డు మర్చిపోయి పోలింగ్ బూత్‌లోకి వెళ్లగా, అక్కడి సిబ్బంది ఓటు వేయడానికి నిరాకరించారు. దీంతో అతను వెనుతిరిగి వెళ్లి, తన గుర్తింపు కార్డు తీసుకొని మళ్ళీ పోలింగ్ బూత్‌కు వచ్చాడు.
ఇది కూడా చదవండి: IPL 2026 GT: GT బ్యాటింగ్-బౌలింగ్ డివిజన్ మస్త్! గుజరాత్ తెలివితేటలకు అమ్ముడుపోయిన కరేబియన్ ఆల్ రౌండర్!
అది చూసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి.. అతను దొంగ ఓటు వేయడానికి వచ్చాడంటూ ఆరోపిస్తూ అతనిపై చేయి చేసుకున్నాడు. ఇది గమనించిన బిఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వాగ్వాదానికి దిగారు. దీంతో కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య మొదలైన ఈ వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారి, ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్లింది.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.

