Illegal surrogacy: ఒక షాకింగ్ ఘటనలో, హైదరాబాద్‌లోని మేడ్చల్ జిల్లాలో పోలీసులు ఒక అక్రమ సరోగసీ ముఠాను పట్టుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్ష్మిరెడ్డి, ఆమె కొడుకు నరేందర్ రెడ్డి. వీరు కలిసి ఒక భారీ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ముంబైలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టై, జైలు నుంచి విడుదలైన తర్వాత లక్ష్మిరెడ్డి తన కొడుకు నరేందర్ రెడ్డితో కలిసి హైదరాబాద్ చేరుకుంది. ఇక్కడ వారు మాదాపూర్, అమీర్‌పేట్, RTC క్రాస్‌రోడ్స్ వంటి ప్రాంతాలలో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అండాలు, సరోగసీకి మహిళలను సమకూర్చుతామని వారికి ఏజెంట్లుగా వ్యవహరించడం మొదలుపెట్టారు.
లక్ష్మిరెడ్డి ఆర్థికంగా వెనుకబడిన మహిళలను టార్గెట్ చేసింది. మూడు సార్లు అండాలు దానం చేస్తే రూ. 30,000, అలాగే సరోగసీ ద్వారా బిడ్డను కని ఇస్తే రూ. 4 లక్షలు ఇస్తానని ఆశ చూపింది. దీనికోసం ఆమె తన ఇంటిలోని గదులను కేవలం బ్యాచిలర్స్ కు మాత్రమే అద్దెకు ఇచ్చింది. వారి నుంచి వీర్యం సేకరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు
పోలీసులు ఇప్పటివరకు సుమారు 50 మంది మహిళలతో సరోగసీ చేయించినట్లు ఆధారాలు సేకరించారు. ఈ వివరాలను లక్ష్మిరెడ్డి ఒక నోట్‌బుక్, డైరీలో జాగ్రత్తగా నమోదు చేసింది. ఇందులో మహిళల జాబితా, వారికి చెల్లించిన డబ్బుల వివరాలు ఉన్నాయి.
Also Read: Pidamarthi Ravi: మార్వాడీ గో బ్యాక్.. మార్వాడీలకు పిడమర్తి రవి వార్నింగ్
కర్ణాటకకు చెందిన ఒక మహిళ భర్త ఫిర్యాదుతో ఈ దందా బయటపడింది. ఆ మహిళకు కిడ్నీలు పాడైనట్లు తెలుసుకున్న లక్ష్మిరెడ్డి, కిడ్నీ ఆపరేషన్ ఖర్చు తానే భరించి, ఆ తర్వాత ఆమె సరోగసీ చేయాలని ఒప్పందం చేసుకుంది. ఆ మహిళ భర్త ఈ విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మిరెడ్డి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ముఠా తమ దగ్గర ఉన్న మహిళలకు హిందీ నేర్పించింది. సరోగసీ కోసం ఎక్కువగా ఉత్తర భారతదేశం నుంచి దంపతులు వస్తున్నందున, సరోగసీకి ఒప్పుకున్న మహిళ కూడా ఉత్తర భారతదేశం వారేనని నమ్మించడానికి ఇలా శిక్షణ ఇచ్చారు.
ఈ అక్రమ సరోగసీ దందా వెనుక మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. లక్ష్మిరెడ్డి, ఆమె కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
