Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై గట్టిగా స్పందించారు. తాను ఏమాత్రం కాంట్రాక్టుల కోసం ఆశపడే వ్యక్తిని కాదని, తనపై వస్తున్న రూ. 70 కోట్ల కాంట్రాక్ట్ లబ్ధి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. తనకు అంత అవసరం లేదని, “శ్రీనివాస్ రెడ్డి అంటే ఏంటో అందరికీ తెలుసు” అని చెబుతూ, తాను ఎప్పుడూ పారదర్శకంగానే వ్యవహరిస్తానని స్పష్టం చేశారు.
సమ్మక్క-సారక్క జాతర పనులపై క్లారిటీ
సమ్మక్క సారక్క జాతర అభివృద్ధి పనుల గురించి మంత్రి పొంగులేటి వివరాలు వెల్లడించారు. పనులన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని, ఇప్పటికే రూ. 211 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. భక్తుల భద్రత, సౌకర్యాల కోసమే ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా 90 రోజుల్లో పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
అన్ని పనులూ శాశ్వత ప్రతిపాదికన చేపడుతున్నామని, ఈ నిర్మాణాల వల్ల ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణం కోసం అవసరమైన గ్రానైట్‌ను కూడా పక్క రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నట్లు తెలిపారు.
సహచర మంత్రుల ఫిర్యాదుల వార్తలను ఖండించిన పొంగులేటి
తనపై సహచర మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటూ వస్తున్న వార్తలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. “నా మీద ఫిర్యాదు చేయడానికి అసలు ఏముంది? ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది నిజం కాదని నేను బలంగా నమ్ముతున్నాను” అని అన్నారు.
మంత్రులు సీతక్క మరియు సురేఖ ఇద్దరూ సమ్మక్క సారక్కలాగా అంకితభావంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. జాతర విజయవంతం కోసం తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.