Seethakka: ఆదివాసీల జీవన హక్కులు సదా రక్షణ పొందాలన్నది రాజ్యాంగ ఉద్దేశమని, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పనిచేయాలని తెలంగాణ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆమె, కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ఆపరేషన్ కగార్’ పేరిట గత సంవత్సరం నుంచి కేంద్ర బలగాలు అడవుల్లో మోహరించి, స్థానిక ఆదివాసీలను వారి సంప్రదాయ జీవనవిధానానికి దూరం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. అడవి మాత్రమే కాదు, అది వారి జీవనాధారం కూడా. అక్కడకు వెళ్లకుండా వారిని అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. సీతక్క మాట్లాడుతూ, రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని హామీ ఇస్తుంది. ఆదివాసీల హక్కులను కాలరాసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం, అన్నారు.
ఇది కూడా చదవండి: Tragedy: నదిలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన మృతి
ఆపరేషన్ కగార్ వల్ల ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వారు తినే ఆహారం నుండి సంపాదించే ఆదాయం వరకు ప్రతిదీ దెబ్బతింటోందని ఆమె తెలిపారు. కేంద్రం వెంటనే ఈ చర్యలపై పునరాలోచించాలని, లేకపోతే దీన్ని వ్యతిరేకించే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.
సీతక్క చివరగా పేర్కొంటూ – ప్రభుత్వంగా, వ్యక్తిగతంగా నేను ఆదివాసీల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తాను. వారి భద్రత, స్వాభిమానాన్ని కాపాడటమే మా బాధ్యత, అని స్పష్టం చేశారు.