Ponguleti Srinivas Reddy: మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడారం అభివృద్ధి కోసం కేంద్రం ఒక్క రూపాయి కూడా విదిల్చలేదని ఆయన స్పష్టం చేశారు. ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనలో వాస్తవం లేదని పొంగులేటి పేర్కొన్నారు. మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారని, కానీ అది కేవలం మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. క్షేత్రస్థాయిలో కేంద్రం నుంచి ఎలాంటి నిధులు అందలేదని, కిషన్ రెడ్డి కేవలం మాటలు చెబుతున్నారు తప్ప ఆచరణలో చేసిందేమీ లేదని మంత్రి ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పొంగులేటి తెలిపారు. కేంద్రం సాయం చేసినా చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే మేడారాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
