Thatikonda Rajaiah: స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయ వాతావరణం మరోసారి ఉత్కంఠభరితంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన రాజయ్య, “సిగ్గు, శరం ఉంటే కడియం శ్రీహరి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌లో చేరడంలో రూ.200 కోట్ల డీల్ జరిగిందని సంచలన ఆరోపణలు చేస్తూ, ఇప్పటివరకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులకు శ్రీహరి సమాధానం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. పార్టీ ఫారాయించిన ఎమ్మెల్యేపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
అంతేకాదు, ఒకవేళ కడియం శ్రీహరి ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని తప్పించుకునే ప్రయత్నం చేస్తే, “ముక్కు నేలకు రాసి కేసీఆర్‌ను స్వయంగా కలిసి క్షమాపణ చెప్పాలి” అని రాజయ్య సూచించారు.