Thandel: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఘన విజయం సాధించి, రూ. 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నప్పటికీ, పైరసీ సమస్య నుంచి బయటపడలేకపోతోంది.
సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ‘తండేల్’ సినిమాను ప్రదర్శించిన ఘటన బయటకు వచ్చింది. పలాస నుండి విజయవాడకు వెళ్లే ఓ బస్సులో ప్రయాణికులకు ఈ సినిమా చూపించారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఆర్టీసీ ఛైర్మన్ వెంటనే విచారణకు ఆదేశించారు.
అయితే, పైరసీ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే మరో ఆర్టీసీ బస్సులో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ విషయాన్ని నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన వీడియోతో పాటు, బస్సు టికెట్‌ను కూడా షేర్ చేశారు.
సినిమా నిర్మాతలు పైరసీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇది వరుసగా జరిగి రావడం ఆందోళన కలిగించే విషయం. ఆర్టీసీ అధికారులు దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది వేచిచూడాలి.
