TGTET 2026: తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్య గమనిక. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 పరీక్షల షెడ్యూల్ను అధికారులు తాజాగా విడుదల చేశారు. టీచర్ అర్హత పరీక్ష రాయాలనుకునే వారికి ఇది చాలా ముఖ్యమైన అప్డేట్.
ఈసారి టెట్ పరీక్షలను జనవరి 3, 2026 నుంచి జనవరి 20, 2026 వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్ల, మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం ఒక సెషన్, మధ్యాహ్నం ఒక సెషన్ చొప్పున పరీక్షలు జరుగుతాయి.
సమయాల విషయానికి వస్తే, ఉదయం సెషన్ (Session–I) పరీక్ష సరిగ్గా 9:00 గంటలకు మొదలై 11:30 గంటల వరకు కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం సెషన్ (Session–II) పరీక్ష 2:00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు, ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ముందుగానే అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేకాక, పరీక్ష కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర మార్గదర్శకాలు త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
