TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మెకు ఆర్టీసీ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన కార్మిక సంఘాలు వచ్చే నెలలో 7 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదంటూ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ దశలో సమ్మె తప్పదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నదేమి? ప్రభుత్వ నిర్ణయమేమిటి? అన్న విషయాలు తెలుసుకుందాం.
TGSRTC:ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వంతో చర్చిస్తూనే ఉన్నారు. తమ డిమాండ్లు తీర్చాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇప్పటికే మూడుసార్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులను యాజమాన్యానికి అందజేశాయి. తమ డిమాండ్లపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని సంఘాలు కోరుతున్నా, ప్రభుత్వం నుంచి ఇంత వరకు స్పందన రాలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.
TGSRTC:లేబర్ కమిషనర్‌తో కార్మిక సంఘాలు చర్చలు జరిపే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అయితే ఆర్టీసీ యాజమాన్యం ఆ చర్చల్లో పాల్గొనకపోవడంతో చర్చలు జరగకుండానే ఆర్టీసీ జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఈ ఘటన ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ దశలో యాజమాన్యం నుంచి ఓ వాదన వచ్చింది. అదేమిటంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా దానిని సాకుగా చూపుతూ యాజమాన్యం, కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నుంచి తప్పించుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.
TGSRTC:రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా, ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో పురోగతి లేదు. ఇప్పటికీ చాలా మంది ఉద్యోగులకు పూర్తిగా జీతాలు కూడా పడటం లేదు. విలీన ప్రక్రియ గురించి ఎటువంటి ప్రకటన లేకుండా, ప్రభుత్వం సరైన చొరవ చూపకపోవడంపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
TGSRTC:పెండింగ్ బిల్లుల గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో సమస్య మరింత పెరిగింది. ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్ అలాగే ఉన్నది. ఆర్టీసీ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా కొనుగోలు చేయాలని, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించాలని, విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవేవీ ఇప్పట్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఆవేదనతో వచ్చే నెల 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టేందుకు ఆర్టీసీ జేఏసీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నెలలోగా సమస్యలను పరిష్కరిస్తే సమ్మెను ఉపసంహరించే అవకాశం ఉన్నది. లేదంటే సమ్మె తప్పదని తెలుస్తున్నది.