TGSRTC:పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు వివిధ బస్సుల్లో బస్‌భవన్ వద్దకు తరలివచ్చారు. అక్కడ పోలీసులు అడ్డుకున్నా, ముఖ్యులు లోపలికి వెళ్లారు.
TGSRTC:బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ తదితరులు పోలీసు వలయాన్ని దాటుకుని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చాంబర్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో చర్చించారు. ప్రయాణికుల అవస్థలు వివరించారు. పెంచిన చార్జీలతో నగరవాసులపై పడే భారాన్ని ఏకరువు పెట్టారు. రూ.1353 కోట్ల మహాలక్ష్మి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ బృందానికి ఎండీ నాగిరెడ్డి చెప్పారు.
TGSRTC:పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాల్సిందేనని కేటీఆర్, హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం ఎండీ నాగిరెడ్డిని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆయనకు లేఖను అందజేసింది. ఇదిలా ఉండగా, అంతకు ముందు బస్ భవన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసుల అత్యుత్సాహంపై మీడియా ప్రతినిధులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అదే విధంగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అమాంతం ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేయడంతో ఉద్రిక్తత నెలకొన్నది.