TGPSC UPDATES: టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాలను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దుతో కమిషన్ పునరాలోచనలో పడిందా?
గ్రూప్-2 ఫలితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నదా? ఆ తర్వాత గ్రూప్-3 ఫలితాలను ప్రకటిస్తుందా?
కోర్టు కేసుల కారణంగా గ్రూప్-1 ఫలితాలు వెల్లడికి ఆలస్యమవుతుందని భావించిందా? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. దీంతో మిగతా రెండు పరీక్షల ఫలితాలను వెల్లడించి, నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
TGPSC UPDATES: ఇప్పటికే గ్రూప్-2 ధ్రువపత్రాల పరిశీలనను కమిషన్ పూర్తిచేసింది. అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకొని తుది జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నది. మూడు నెలల క్రితమే గ్రూప్-1 తర్వాత వరుసగా గ్రూప్-2 ఫలితాలను వెల్లడించాలని కమిషన్ భావించినా, గ్రూప్-1 న్యాయ వివాదాల కారణంగా జాప్యమైంది.
TGPSC UPDATES: గ్రూప్-2 కింద టీజీపీఎస్సీ 783 పోస్టులతో నోటిఫికేషన్ జారీచేసింది. దీనికోసం మొత్తంగా 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 డిసెంబర్‌లోనే రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. ఓఎంఆర్ పత్రాల్లో తప్పులు, బబ్లింగ్ సరిగా చేయక తదితర కారణాలుగా చూపింది.
TGPSC UPDATES: ఈ మేరకు 2,36,649 మందికి వచ్చిన మార్కులన్నింటితో కలిసి జీఆర్ఎల్ (జనరల్ ర్యాంకింగ్ లిస్టు)ను 2025 మార్చి 11న ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో మూడు దఫాలుగా ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులను ఎంపిక చేసింది. మిగిలిన పోస్టులకు తర్వాతి మెరిట్ జాబితా నుంచి అభ్యర్థులను మూడో దఫా పరిశీలనలకు కమిషన్ పిలిచింది. వీరందరికీ ఈ నెల 13 నుంచి 15 వరకు పరిశీలన పూర్తిచేసింది. కొన్ని పోస్టులకు అవసరమైన వైద్య పరీక్షలు కూడా నిర్వహించింది. గ్రూప్-1 న్యాయ వివాదాల కారణంగా గ్రూప్-2 తుది ఫలితాల వెల్లడికి కసరత్తు చేస్తున్నది.