TG Inter Results 2025: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు ఇటీవలే ముగిశాయి. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 24 లేదా 25వ తేదీల్లో విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నీ సజావుగా జరిగితే ఏప్రిల్ 24నే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
ఈసారి ప్రత్యేకంగా విద్యార్థుల సౌలభ్యం కోసం ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫలితాల రోజున విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పంపితే వాట్సాప్‌లోనే ఫలితాలను పొందే అవకాశం ఉండనుంది.
ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని, ప్రస్తుతం సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)లో ఫలితాల క్రోడీకరణ జరుగుతోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశముంది. ఏప్రిల్ నాల్గో వారంలో ఫలితాలు ఖచ్చితంగా విడుదల అవుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: HYDERABAD: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలుకు సిద్దమవుతున్న తెలంగాణ ప్రభుత్వం
ఇక ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించగా, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ఇవ్వబడ్డాయి. అనంతరం జూన్ 2వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు మాత్రం జూన్ 12వ తేదీ నుంచి కొత్త విద్యాసంవత్సరాన్ని మొదలుపెట్టనున్నాయి.
ఇకపోతే, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. అక్కడ పదో తరగతి ఫలితాల విడుదలకు కూడా సిద్ధతలు జరుగుతున్నాయని సమాచారం.