Tesla: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా ఎట్టకేలకు భారతదేశంలో అడుగు పెట్టింది. ముంబైలో తొలి టెస్లా షోరూమ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టెస్లా తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కారు మోడల్ Yను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే ఈ కారు ధర చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
టెస్లా ధరలు ఎందుకు అంత ఎక్కువ?
టెస్లా మోడల్ Yను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఒక మోడల్ ధర ₹59.89 లక్షలు, మరొకటి ₹67.89 లక్షలు. అమెరికాలో ఇదే కారు పన్నులతో కలిపి సుమారు ₹33 లక్షలకు లభిస్తుంది. మరి భారతదేశంలో ఎందుకు ఇంత ఖరీదు?
దీనికి కారణం.. భారీ పన్నులు.
ప్రస్తుతం టెస్లా భారతదేశంలో తన వాహనాలను తయారు చేయడం లేదు. ఈ కార్లు చైనాలో తయారై భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై 70% దిగుమతి సుంకం, అలాగే 30% లగ్జరీ పన్ను విధించబడుతోంది. దీని వల్ల రూ.27 లక్షల విలువైన కారు ధర భారత మార్కెట్‌లో దాదాపు రూ.60 లక్షలకు చేరుకుంటోంది.
ఇది కూడా చదవండి: Hyderabad: అన్నకు కొత్త జీవితం ఇచ్చిన చెల్లి.. అరుదైన వ్యాధి నుండి బయటపడ్డ బాలుడు
సోషల్ మీడియాలో “టాక్స్-లా” వ్యాఖ్యలు
టెస్లా భారీ ధరలపై సోషల్ మీడియాలో ప్రజలు సరదాగా స్పందిస్తున్నారు. కొందరు టెస్లా పేరును “టాక్స్-లా” గా మార్చేశారు. ఒకరు ట్వీట్ చేస్తూ “భారతదేశంలో టెస్లా కొనడం అంటే కంపెనీకి 27 లక్షలు, ప్రభుత్వానికి 33 లక్షలు పన్ను చెల్లించడం లాంటిదే . ఇది పన్ను దోపిడీ కాకపోతే ఏమిటి?” అని అన్నారు. మరొకరు “టెస్లా కారు కంటే పన్నులే ఎక్కువ. దీనిని టెస్లా అని కాకుండా టాక్స్-లా అని పిలవాలి” అని సరదాగా రాశారు.
టెస్లాకు ముందున్న సవాళ్లు
ఎలోన్ మస్క్‌కు భారత మార్కెట్‌పై పెద్ద ఆశలు ఉన్నా, భారీ పన్నులు, దిగుమతి సుంకం కారణంగా టెస్లాకు ఇక్కడ సవాళ్లు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
టెస్లా భారతదేశంలో తయారీ యూనిట్ లేదా కనీసం అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభిస్తేనే ధరలు తగ్గే అవకాశం ఉంది. స్థానిక ఉత్పత్తి ప్రారంభిస్తే దిగుమతి సుంకం తగ్గి టెస్లా కార్లు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.