Manuguru: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు తొలుత బీఆర్‌ఎస్ ఆఫీసు ఆవరణలో ఉన్న ఫ్లెక్సీలను, బ్యానర్లను పూర్తిగా చింపివేశారు. అనంతరం కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లిన దుండగులు, అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయంలోని సామగ్రి కొంత మేరకు దగ్ధమైంది. ఈ దాడికి గల కారణాలపై స్పందిస్తూ, బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read: Hyderabad: చంద్రాయన్ గుట్టలో విద్యార్థులు ఉండగానే స్కూల్ భవనం కూల్చివేత
దాడి విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మణుగూరు బీఆర్‌ఎస్ కార్యాలయం వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలను చెదరగొట్టి, మరింత ఘర్షణ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇరు పార్టీల మధ్య రాజకీయ కక్షలు, దాడులు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఈ దాడి రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచింది.

