Bhupalpally: భూపాలపల్లి జిల్లాలో ఇసుక దందా అంశంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది. ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోటాపోటీ ఆందోళనలు
ఇసుక దందాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతుల దిష్టిబొమ్మలను దహనం చేసేందుకు పిలుపునిచ్చారు. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ నాయకులు కూడా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఇరు పార్టీల నాయకుల నినాదాలు, ఆందోళనలతో భూపాలపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక దందా ఆరోపణలు, దానిపై కొనసాగుతున్న రాజకీయ పోరుతో భూపాలపల్లి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.